
వరంగల్: బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ మంత్రులు అన్ని రకాలుగా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని.. స్కీముల పేరుతో భారీ ఎత్తున స్కాములు చేశారని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క.. గొర్రెల పంపిణీ పథకం గురించి ప్రస్తావిస్తూ.. యాదవులకు అందించే గొర్రెల విషయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఇందులో తప్పు చేసిన ఏ ఒక్క నాయకుణ్ని వదలమని హెచ్చరించిన సీతక్క.. ప్రతీ ఒక్కరి దగ్గరి నుంచి వెనకేసుకున్న సొమ్మును ముక్కు పిండి వసూలు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ఎలాంటి అవకతవకలకు వీల్లేకుండా పారదర్శకంగా, వినూత్నంగా అమలు చేయనున్నామని తెలిపారు. రామప్పకు మిస్ వరల్డ్ రాక గురించి మాట్లాడుతూ.. రామప్ప ప్రపంచ వారసత్వ సంపద కాబట్టే ప్రపంచ దేశాల సుందరీమణులను ఇక్కడికి ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ పోటీలు తెలంగాణను ప్రపంచ వేధికపై సగర్వంగా నిలబెడతాయన్నారు.