
ఓ కేసు కోసం స్టేషన్‌కి వెళ్తే ఓ పోలీసు అధికారి లంచం అడిగాడు.. నా పాస్‌పోర్టును వెరిఫై చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు.. అన్యాయంగా నా బండిపై చలాన్ వేశారు.. మా కేసు విషయంలో కావాలనే ఆలస్యం చేస్తున్నారు.. మా స్టేషన్ అధికారి మరీ ఇంత దారుణంగా ఉన్నాడేంటి..? ఇలాంటి అభిప్రాయాలెప్పుడైనా పోలీసులపై కలిగాయా..? కానీ, ఎవరికి చెప్పాలో తెలియక ఆగిపోయారా..? అయితే, ఇది మీకోసమే.

తెలంగాణా రాష్ట్ర పోలీసు శాఖ రాష్ట్ర ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. మీ ఠాణా పోలీసుల పనితీరు, అందుతున్న సేవలపై మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా స్థానిక అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫిర్యాదు, ఈ-చలాన్, ఎఫ్ఐఆర్, పాస్‌పోర్టు ధ్రువీకరణ, ఇతర అంశాలపై మీకు అందిన సేవలు వాటిపై మీ అభిప్రాయాలు చెప్పవచ్చు.