India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి(Terror Attack) తర్వాత భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్‌ను తక్షణమే నేలమట్టం చేయాలని.. ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందేనని తమకు తోచిన పద్దతుల్లో కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనిపై కర్ణాటక (Karnataka) గృహ నిర్మాణ, మైనారిటీ శాఖ మంత్రి బీజే జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దేశం కోసం తాను సూసైడ్ బాంబర్ గా మారేందుకు సిద్ధమన్న ఈ మంత్రి.. తనను మోదీ, అమిత్ షా అనుమతించాలని కోరారు.

శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి బీజే జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎప్పటికీ భారత్‌కు శత్రుదేశమే అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు అనుమతిస్తే పాక్‌తో యుద్ధానికి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ‘మేం భారతీయులం, మేం హిందుస్థానీయులం. పాకిస్థాన్ మాతో ఎప్పుడూ సంబంధాలు పెట్టుకోలేదు. పాక్ ఎప్పటికీ భారత్‌కు శత్రుదేశమే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. దాన్ని నా శరీరానికి అమర్చుకుని పాక్‌వెళ్లి వారిపై దాడి చేస్తాను’ అని మంత్రి అన్నారు.
పహల్గాంలో పర్యాటకుల్ని మతం చూసి ఒక్కొక్కరినీ చంపడంతో దేశంలోని ముస్లింలపై కూడా కొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ.. ఒక్కో ముస్లిం నాయకుడు, ప్రముఖులు తమ వ్యతిరేకతను బహిర్గతం చేస్తున్నారు. నిన్న ఓ సమావేశంలో ప్రముఖ దర్శకుడు, రచయిత జావేద్ అక్తర్ పాకిస్థాన్ పై మండిపడగా.. నేడు కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.