
Chandrababu Naidu: ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ తీసుకునే నిర్ణయాలకు తెదేపా, తెలుగు ప్రజలు ఎప్పుడూ అండగా నిలబడతారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి పునఃప్రారంభ వేడుకలో మాట్లాడిన ఆయన.. పహల్గామ్ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో మోదీని ఎప్పుడు కలిసినా ఆహ్లాదంగా ఉండేదని.. మొన్న అమరావతి కార్యక్రమం కోసం పిలిచేందుకు వెళ్లినప్పుడు ఎప్పుడూ చూడని గంభీర వాతావరణం అక్కడ కనిపించిందన్నారు. మోదీజీ ఆవేదన చూసి చలించిపోయానన్నారు. అనంతరం హిందీ భాషలో స్పందిస్తూ.. ‘ మోదీ జీ హమ్ ఆప్ కే సాత్ హై.. ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ లోగ్ ఆప్ కే సాత్ హై.. పూరా దేశ్ ఆప్ కే సాత్ హై’ అని అన్నారు చంద్రబాబు.
అనంతరం సీఎం చెప్పిన వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్‌కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.