Maharashtra: మహారాష్ట్రలోని వార్వండి గ్రామంలో ఓ పొలంలో ఉన్న భారీ బాంబు(Bomb)ను భారత ఆర్మీ(Indian Army) సిబ్బంది నిర్వీర్యం చేశారు. 453 కిలోల బరువున్న ఈ బాంబును నిర్వీర్యం చేయడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది. రాజేంద్ర ధాగే అనే ఓ రైతు మార్చి 28న తన పొలంలో ఏదో పేలుడు పధార్థం ఉందని స్థానిక ఎమ్మార్వోకు సమాచారం అందించాడు. పొలం లోపల ఏర్పాటు చేసిన పైపులైన్ పగిలి పోవడంతో మరమ్మతుల కోసం తవ్వగా ఈ బాంబు కనిపించింది. దీంతో ఆర్మీ, పోలీస్ విభాగాలకు సమాచారమిచ్చిన అధికారులు.. తవ్వకాలు జరిపారు. పిన్ బయటకి రావడంతో స్థానిక ప్రజలందరినీ అక్కడి నుంచి తరలించారు.

కేంద్రప్రభుత్వ అనుమతులు రాగానే.. పుణెలోని 10మంది వైమానిక, ఆర్మీ దళ అధికారులు ఇక్కడికి చేరుకొని నెలరోజుల పాటు తవ్వి బయటకు తీశారు. నిర్వీర్యం చేసేందుకు జేసీబీల సాయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బాంబును తరలించే మార్గంలోనూ అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. ఇది పేలి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదని వెల్లడించారు. అయితే ఈ బాంబు ఇక్కడికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.