ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో ఏదో ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది బీసీసీఐ. అంపైరింగ్ నిర్ణయాలు, కెమెరాలు, ఆటగాళ్ల ప్రచారాలు.. ఇలా ప్రతీదాంట్లో ఏదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి ఐపీఎల్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన రోబో డాగ్ చంపక్ ఇప్పుడు కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో ముచ్చట్లు, ఆట మానిటరింగ్ తదితర విషయాలతో ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ రోబో పేరు వివాదంగా మారింది. తమ సంస్థకు చెందిన రిజిస్టర్డ్ పేరును అనుమతి లేకుండా వాడుకున్నారంటూ పరువునష్టం కింద రూ.2 కోట్లను చెల్లించాలంటూ బోర్డుపై ఓ ప్రసిద్ధ పిల్లల పత్రిక కేసు వేసింది.

పత్రిక దిల్లీ కోర్డును ఆశ్రయించగా.. ఈ విషయంలో బోర్డుకు నోటీసులు జారీ చేసింది. దీని మీద 4 రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై జులై 9వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. కాగా, రోబో డాగ్‌కు చంపక్ అని నామకరణం చేయడం వల్ల తమ ట్రేడ్‌మార్క్, బ్రాండ్ దెబ్బతిందని.. పరువునష్టం కింద తమకు బీసీసీఐ రూ.2 కోట్లు చెల్లించాలని కోర్టును కోరిందా మ్యాగజీన్. ఒకవేళ బోర్డు చేసింది నేరం అని రుజువైతే పరిహారం చెల్లించక తప్పదు.