Revanth: దేశవ్యాప్తంగా జనగణననతో పాటు కులగణన (Caste Census) చేస్తామంటూ కేంద్రం (Central Govt) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కులగణన నిర్ణయం విషయంలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని.. రాహుల్ పాదయాత్రలో కుల గణనపై చర్చ చేశారన్నారు. కుల గణన చేయాల్సిందేనని రాహుల్ తేల్చి చెప్పారని తెలిపారు. కేంద్రం నిర్ణయంపై రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని వెల్లడించారు.
కుల గణనపై తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ఉందన్నారు. కుల గణన కోసం దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని తెలిపారు. కుల గణన కోసం మంత్రులతో ఒక కమిటీ ఏర్పడి చేయాలని.. అధికారులతో, నిపుణులతో ఒక కమిటీ వేసి అధ్యయనం చేయాలని సూచించారు. కులగణన కోసం తెలంగాణ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రానికి తెలిపారు. మంత్రుల కమిటీ వెంటనే నియమించాలన్నారు. మంత్రుల కమిటీకి తోడుగా నిపుణుల కమిటీని వేయాలన్నారు. ఈ రెండు కమిటీలతో దేశవ్యాప్తంగా అధ్యయనం చేయించాలని తెలిపారు. తూతూ మంత్రంగా కుల గణన చేస్తే దానితో ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. కుల గణన దేశాన్ని జిరాక్స్ తీసినట్టు అవుతుందన్నారు. జిరాక్స్ తీస్తే రోగం ఏంటి? ఏ మందు వేయాలి అని తెలుస్తుందని తెలిపారు.