తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు ఏర్పడిన నాటి నుంచీ ప్రభుత్వ నిర్ణయాలతో ముడిపడిన అనేక అంశాలపై బహిరంగంగానే స్మిత తన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలె కంచ గచ్చబౌలి భూముల విషయంలోనూ ఎక్స్(ట్విటర్) వేధికగా పోస్ట్ పెట్టడంతో విచారణకు సైతం హాజరవ్వాల్సి వచ్చింది. ఆ కేసు వేడి తగ్గకముందే రేవంత్ సర్కారు ఆమెను టూరిజం శాఖ నుంచి ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేసింది. దీనిపై తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేసిన స్మిత.. భగవద్గీతలోని కర్మణ్యే వాధికరస్తే మా ఫలేషు కదాచణ అనే శ్లోకాన్ని ఉంటంకిస్తూ… 4 నెలల్లోనే టూరిజం శాఖలో కీలక మార్పులు తీసుకొచ్చాను. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ రూపకల్పనతో పాటు శాఖ ఉద్యోగుల పనితీరు పూర్తిగా మార్చేసి, అందరికీ బాధ్యత నేర్పించాను.. అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

అయితే ఈ అధికారిణి పెట్టిన శ్లోకానికి నువ్వు పనిచేయడానికి మాత్రమే కానీ దాని ఫలితంపై ఎలాంటి అధికారం ఉండదని అర్థం. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శ మొదలైంది. ఐఏఎస్ అనేది ప్రజలకు సేవ చేయడానికే తప్ప.. లాభాలు ఆశించడానికి కాదంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ ఎందుకు మేడం ముసుగులో గుద్దులాట నేరుగా ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోండి అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ శ్రేణులు స్మితా సబర్వాల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీటికి ధీటుగా బదులిస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉన్నారు స్మిత. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఆమె అభిమానులు, పలువురు నెటిజన్లతో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి తనకు మద్దతు లభిస్తోంది. పట్టించుకోవద్దంటూ హితవు పలుకుతూనే త్వరలో మన ప్రభుత్వం రాగానే మీకు మంచి స్థానం దక్కుతుందంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.