
జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఇటీవల ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సర్కారు సీరియస్ గా ఉంది. ఈమేరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ నిర్ణయం వెనక ఉన్నదెవరూ కనుక్కోవాలని హోంశాఖ సెక్రటరీని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) టార్గెట్ గా ఇది జరిగినట్లు జనసేన(Janasena) వర్గాలు భావిస్తున్నాయి. హరిహర వీరమల్లు(Harihara Veeramallu) విడుదలకు సిద్ధమవుతుండగా కావాలనే ఈ చర్చలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇన్నేళ్లుగా ఈ సమస్య ఉన్నా.. వాటాల విషయంలో ఎగ్జిబిటర్లు ఎవరూ ధైర్యం చేసి మాట్లాడలేదు. పర్సంటేజీలు, షేర్ల గురించి చర్చలు వచ్చినా చిన్నదానిగానే భావించారు. కానీ, గత వారం రోజులుగా ఈ వివాదంలో కొందరు నిర్మాతలూ భాగం పంచుకోవడంతో సమస్య తీవ్రతరమైందని జనసేన నేతలు అంటున్నారు. ఇరువర్గాలకు నష్టం కలిగించే థియేటర్ల మూసివేతకూ వెనకాడలేదంటే కారణం పవన్ ని టార్గెట్ చేయడమేనని స్పష్టం చేస్తున్నారు.
అయితే, దీని వెనక ఉన్న నలుగురు త్వరలోనే బయటపడతారంటూ జనసేన నేతలు(Janasena Party) చెబుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ సైతం హరిహర వీరమల్లుకు అడ్డు వస్తున్న ఆ నలుగురు ఎవరు..? ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు కింద.. జనసైనికులు ఓ నలుగురు నిర్మాతల పేర్లను ప్రకటించేస్తున్నారు. అల్లు అర్జున్(Allu Arjun) తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, నిర్మాతలు దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేశ్ బాబేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ఎన్నికలకు ముందు నుంచి అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య తరచూ ఏదో ఒక వివాదం పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నిర్మాతల నుంచి ఇంకా ఏ ప్రకటనా రాలేదు.