
మావోయిస్టు ఉద్యమానికి తొలిసారి భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేశాయి. భద్రతా దళాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ.. కనిపించిన మావోయిస్టులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎదురు తిరిగితే హతమారుస్తున్నారు. దీనిపై మేధావి వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేసినా కేంద్రం తగ్గట్లేదు. దీంతో ఉద్యమం మెల్లిమెల్లిగా నీరుగారిపోతోంది.
ఎదురు దాడుల్లో 146 మందిని కోల్పోవడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేస్తున్న పోరాటం సరైనది కాదని.. జనజీవనం కలిసిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తామనే భరోసా ఇస్తూ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు దాదాపు సఫలమైనట్లే కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలున్నారు.
నిన్న లొంగిపోయిన 14 మందిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ACMs), నలుగురు పార్టీ సభ్యులు, నలుగురు గ్రామ కమిటీ సభ్యులు (VCMs), ముగ్గురు రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ (RPC) సభ్యులు, ఒకరు క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం (KAMS) సభ్యురాలు ఉన్నారు. వాజేడు కమిటీకి నాయకత్వం వహిస్తున్న సోడి బుద్రా, కాలమా ఇడిమే అలియాస్ రాధికా సైతం వీరిలో ఉన్నారు.

ఈ ఏడాది.. 227 మంది లొంగుబాటు!
తెలంగాణ పోలీస్ శాఖ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమం మావోయిస్టులకు భరోసానిస్తోంది. పునరావాసం, జీవనోపాధి అవకాశాలు, భద్రత వంటి అంశాలపై పోలీసులు నమ్మకం కల్పిస్తుండటంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 227 మంది మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందించే అన్ని పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని.. నగదు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తున్నామని తెలిపారు.