
Andhra Pradesh: రాష్ట్రంలో ఇకపై నెలలో 15 రోజుల పాటు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందించనున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తెలిపారు. గత ప్రభుత్వం (YSRCP)సమయంలో రేషన్ సరుకులు ఇంటింటికీ అందించాలనే పేరుతో రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ, వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు. నెలలో ఒకటిరెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనాలు నిలిపి పంపిణీ చేస్తూ పేద ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని పవన్ విమర్శించారు. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక, రోజు వారీ పనులు మానేసి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఇంతలోనే వేలాది టన్నుల అక్రమ బియ్యం కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని వివరించారు. ఇకపై ఇటువంటి అక్రమాలకు తావు ఉండదని తెలిపారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్దనే సరుకులను పంపిణీ చేస్తామని తెలిపారు. దీనివల్ల రద్దీ తగ్గడంతో పాటు ప్రతి కుటుంబానికి సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇంతటితో మాత్రమే కాదు, దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు చేర్చే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోందని పవన్ చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) నేతృత్వంలో విజయవంతంగా అమలు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.