హీరోయిన్ క‌ల్పిక‌పై ప‌బ్ మేనేజ‌ర్ దాడి?!

Share this article

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో మరోసారి పబ్ వివాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి(Gachibowli) విప్రో సర్కిల్‌ వద్ద ఉన్న ప్రిజం పబ్‌(Prism Pub)లో హీరోయిన్ కల్పిక(Actress Kalpika)పై దాడి జరిగిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. పబ్‌లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో కల్పిక గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

వివరాల ప్రకారం.. ఓ స్నేహితురాలితో కలసి ప్రిజం పబ్‌కి వెళ్లిన కల్పికకు అక్కడ ఉన్న సిబ్బందితో బర్త్‌డే కేక్‌ విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. మొదట మాటల మార్పిడితో ప్రారంభమైన వివాదం క్రమేపీ తీవ్ర స్థాయికి చేరుకుంది. సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో కల్పిక ఆగ్రహానికి లోనయ్యింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ముదిరి పబ్ సిబ్బంది కల్పికపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై కల్పిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా పబ్ యాజమాన్యం తీరులో మార్పు లేకపోయినట్టు ఆమె ఆరోపించింది. “పబ్‌లో నన్ను దురుసుగా దూషించారు, దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినా అదే తీరు కొనసాగింది,” అని ఆమె మీడియాకు వెల్లడించింది.

ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రిజం పబ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. పబ్ సిబ్బందిని విచారిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై ప్రిజం పబ్ యాజమాన్యం ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

ఇదే సమయంలో హైదరాబాద్‌లోని పబ్‌ల్లో ఇటీవలి కాలంలో తరచూ వివాదాలు నెలకొనడం గమనార్హం. కొద్దికాలం క్రితమే జూబ్లీహిల్స్‌లో ఓ యువతిపై పబ్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నగరంలోని పబ్‌లపై పోలీస్ శాఖ కఠిన చర్యలు కూడా తీసుకుంది. అయినా కూడా పబ్‌లలో భద్రతపై అనేక ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రిజం పబ్ ప్రస్తుతం గచ్చిబౌలిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్‌లలో ఒకటి. సెలబ్రిటీ ఈవెంట్లు, పార్టీలకు ఈ పబ్ తరచూ వేదికగా మారుతోంది. తాజాగా కల్పికపై జరిగిన ఈ దాడి ఘటనతో మరోసారి నగరంలోని పబ్‌లలో నిర్వహణ, మహిళా భద్రత అంశంపై చర్చ మొదలైంది. పోలీసుల దర్యాప్తుతో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *