సింహాచలం కొండపై రిటెయినింగ్ గోడ కూలి భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైదిక సిబ్బంది అభ్యంతరం చెప్పినా వినకుండా అధికారులు గోడ నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది. ఏపీ దేవాదాయ, పర్యాటక శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో జాప్యం ఏర్పడిందని.. ఇప్పుడు చందనోత్సవాల సందర్భంగా హడావుడిగా పనులు నిర్మాణం మళ్లీ మొదలుపెట్టారని.. కాంక్రీట్‌తో కట్టాల్సిన చోట సిమెంటు ఇటుకలను పైపైన పేర్చి నాసిరకం సిమెంటును వాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిమెంటు ఇటుకను చేతితో నలిపితే ఇసుక రాలిపడేంత నాసిరకం ఉందంటూ విమర్శలొస్తున్నాయి.

చందనోత్సవం నేపథ్యంలో ‘ప్రసాద్’ పథకంలో కొన్ని పనులు ఇటీవల చేపట్టారు. రూ.11.18 కోట్లతో ప్రయాణికులు వేచి ఉండే హాలు రిటెనింగ్ వాల్ నిర్మించేందుకు నిర్ణయించారు. దర్శనం అనంతరం మాడవీధుల్లోని జోడువద్రాల వద్ద నుండి దుకాణ సముదాయం మీదుగా బస్టాండుకు వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. ఎత్తైన ప్రదేశం నుంచి నేరుగా మెట్లు నిర్మించకుండా ‘బో’ ఆకారంలో రెండు వైపులా మార్గాలుండేలా కట్టారు. ఈ మెట్లు కలిసేచోట సుమారు 12 అడుగుల ఎత్తులో రిటెయినింగ్ వాల్ నిర్మించారు. అక్కడ గోడ వద్దని వైదికులు సూచించినా పర్యాటకశాఖ అదికారులు పెడచెవిన పెట్టడంతో పాటు అడుగడుగునా అవినీతికి చోటివ్వడంతో అమాయకులు బలయ్యారనే విమర్శలొస్తున్నాయి.