వెండితెరపై సినిమా రిలీజంటే నిర్మాతలకు మామూలు విషయం కాదు. రూ.కోట్లు పెట్టిన సినిమాలు తెర మీద ఆడాలంటే కథతో పాటు మంచి ముహూర్తమూ కలిసి రావాలని నమ్ముతారు నిర్మాతలు. ఇప్పుడు సమంత కూడా అదే బాట పట్టింది. కానీ, నటిగానే కాదు నిర్మాతగానూ. నాగచైతన్య (Naga Chaitanya) తో విడాకులు, అనారోగ్య సమస్యలతో సినిమాల వేగం తగ్గించింది సామ్. జాతీయ స్థాయిలో వెబ్ సీరిస్ లను చేస్తున్నా… సినిమాల మీద మాత్రం అంత ఫోకస్ పెట్టడం లేదు. పైగా సమంత నటించిన ‘యశోద’ (Yasoda), ‘ఖుషీ (Khushi)’ ఫర్వాలేదనిపించినా… ‘శాకుంతలం’ (Shakunthalam) నిరాశకు గురిచేసింది. అయితే… ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, తనకు నచ్చిన సినిమాలను, నచ్చిన వారితో నిర్మిస్తోంది సమంత.

తన సొంత బ్యానర్ లో ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే సినిమాను సమంత ప్రకటించింది. అందులో తానే కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఏ హడావుడీ లేకుండా ఈ మధ్యనే ‘శుభం’ (Shubham) అనే మరో సినిమాకూ తానే నిర్మాత అనే వార్తలు వెలువడ్డాయి.
టీవీ సీరియల్స్ నేపథ్యంలో తెరకెక్కిన హారర్ కామెడీ డ్రామా ‘శుభం’. కొత్త, చిన్న నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని ‘సినిమా బండి’ (Cinema Bandi) ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ‘శుభం’ చిత్రం మే 9న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… ఇదే తేదీన సమంత కీలక పాత్ర పోషించిన ‘మహానటి’ సినిమా విడుదలైంది. సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఈ సినిమాలో టైటిల్ పాత్రను కీర్తి సురేశ్ పోషించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. అందులో సమంత నాయిక కాకపోయినా ఆమె పోషించిన జర్నలిస్ట్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా విడుదలై చక్కని విజయాన్ని అందుకున్న మే 9వ తేదీనే సమంత నిర్మిస్తున్న మొట్టమొదటి సినిమా ‘శుభం’ వస్తుండటం విశేషం. మరి ‘మహానటి’ సెంటిమెంట్ కలిసొచ్చి… ‘శుభం’ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.