కేంద్ర మాజీ మంత్రి సుస్మా స్వరాజ్(Sushma Swaraj) ఇచ్చిన లేఖకు కట్టుబడి కులగణన(Caste Census)పై తాము నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. అంతకాని కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు భయపడి తాము ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో జనగణన చేసేటప్పుడు కులగణన చేస్తామని హోం మంత్రి అమిత్ షా చెప్పారని ఆయన గుర్తు చేశారు.
దేశానికి, సమాజానికి మేలు చేసే నిర్ణయాలను తీసుకునే దమ్ము తమకు ఉందని చెప్పారు. అంతకానీ ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే స్టేజ్‌లో తాము లేమన్నారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో జనగణనలో కులగణన చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది సానుకూలమైన మార్పుకు నాందిగా ఆయన అభివర్ణించారు.