Pakistan: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో తమ దేశంపై ఎప్పుడైనా భారత్ దాడి చేయొచ్చని పాక్ భయపడుతోంది. దీనికి తగ్గట్టు స్పందన ఇచ్చేందుకు చైనా, తుర్కియేతో పాటు భారత్ చుట్టూ ఉన్న దేశాల సాయం కోరేందుకు చేతులు కలుపుతోంది. వైమానిక, నేవిక, సైన్యాలను ఇప్పటికే సరిహద్దుల్లో సిద్ధం చేసి కూర్చున్న పాక్.. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఆయన్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకించింది.
ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఆయన్ను గతేడాది సెప్టెంబరులో ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు. నిఘా సంస్థ అధిపతి కంటే ముందు పాక్ మిలిటరీ ఏజీగా బాధ్యతలు నిర్వర్తించారు ఆసిమ్. ఆయన ఏజీగా ఉన్న సమయంలోనే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, మద్దతుదారులపై ఆర్మీ అణచివేత చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.