కశ్మీర్ లోని పహెల్గామ్ లో 30 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనలో.. దాడి సూత్రదారి పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందేనన్న ప్రతీ భారత పౌరుడి పిలుపు మేరకు కేంద్ర సర్కారు పాక్‌పై ఆంక్షలు విధించింది. గురువారం బిహార్‌లో ప్రసంగంలోనూ ప్రధాని మోదీ పాక్‌కు హెచ్చరికలు పంపించారు. కలలో కూడా ఊహించని శిక్షలుంటాయన్నారు. దాడి తరువాత ప్రధాని మోదీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ కమిటి తక్షణం పాక్‌పై ఐదు చర్యలకు ఉపక్రమించింది.

1. సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంతో పాక్‌కు భారత్ భారీ షాకిచ్చింది. పాక్ సాగునీటి, తాగు నీటి అసరాలకు, ఆర్థికానికి కీలకంగా మారిన సింధు నదీ జలాల పంపిణీలో ఆటంకాలు దాయాదికి చుక్కలు చూపించనున్నాయి.
2. భారత్ పాక్ మధ్య ఉన్న అట్టారీ వాఘా బార్డర్‌ను కూడా ప్రభుత్వం మూసివేసింది. ఇప్పటికే ఈ మార్గం మీదుగా భారత్ వచ్చిన పాకిస్థానీయులు మే 1లోపు దేశాన్ని వీడాలని స్పష్టం చేసింది. ఇక్కడ నిర్వహించే రిట్రీట్ సెరమనీ వేడుకలను కూడా పరిమితంగా నిర్వహిస్తామని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పేర్కొంది.
3. భారత్‌లోని పాక్ మిలిటరీ అనుబంధ సిబ్బందిని తమ దేశానికి తిరిగి వెళ్లాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఇరు దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించింది.
4. సార్క్ వీసా మినహాయింపు పథకం నుంచి పాక్ జాతీయులను తప్పించింది. ఇప్పటికే ఈ పథకం కింద భారత్‌లో ఉన్న వారు 48 గంటల్లోపు దేశాన్ని వీడాలని బుధవారం స్పష్టం చేసింది.
5. ఇక పాకిస్థానీలకు సాధారణ వీసాల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు గురువారం భారత్ ప్రకటించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాల ఏప్రిల్ 27 వరకే అమల్లో ఉంటయాని పేర్కొంది. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకూ చెల్లుబాటు అవుతాయని చెప్పింది. ఈ గడువు ముగిసేలోపే పాకిస్థానీయులు దేశాన్ని వీడాలని స్పష్టం చేసింది.