Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.8.15 లక్షల కోట్ల అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని విమర్శించారు. గురువారం రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందన్నారు. రాష్ట్రం అప్పుల పాలయితే కేసీఆర్ కుటుంబానికి పత్రికలు, ఛానెళ్లు, ఫామ్‌హౌజులు ఎలా వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. కనీసం ధర్నాచౌక్‌లో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశాడన్నారు.
ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు మన కోర్సులు లేవని.. వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికే స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. తొలి ఏడాదిలోనే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని.. రూ.1000కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఒక్కోటి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని.. ఈ సమయంలో విమర్శలు వద్దని హితవు పలికారు. కపట నాటక సూత్రధారి మళ్లీ బయటకు వచ్చాడు.. నమ్మి మోసపోవద్దంటూ మాజీ సీఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.