Goa: గోవాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శిర్గావ్‌లోని లైరా దేవి ఆలయంలో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజున పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరకు గోవా, కర్ణాటకతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అయితే, శుక్రవారం జాతరకు అంచనాకు మించి భక్తులు పోటెత్తారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరగ్గా.. భక్తులు ఒకరిపై ఒకరు పడి తొక్కిసాలట(Stampede) జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 50 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తునే బడ్జెట్ కేటాయిస్తోంది. దీనికి సరైన ఏర్పాట్లు చేసేందుకూ తగిన సౌకర్యాలూ కల్పిస్తోంది. అయితే ఇంత మంది భక్తులు వస్తారన్న అంచనా ముందు లేదని ఆలయ అధికారులు చెబుతుంటే.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసాలట జరిగిందని భక్తులు మండిపడుతున్నారు. సరైన ఏర్పాట్లు ఎక్కడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.